చండీగఢ్: కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారడంతో అడవి జంతువులు రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఒక అడవి దున్న రోడ్డు పైకి వచ్చి స్థానికులను ఆశ్చర్యపరచగా, కేరళలో మలబార్ సివెట్ రోడ్డుపై ఠీవిగా నడుచుకుంటూ వెళుతూ కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చండీగఢ్‌లో చోటు చేసుకుంది. ( కరోనా: కేరళ రోడ్డుపై అనుకోని అతిథి)
చిరుతను పోలిన ఓ అడవి జంతువు సోమవారం చండీగఢ్‌లోని సెక్టార్ 5 రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఒక ఇంటిలో కనిపించింది. దీంతో అక్కడ ఉన్న ఎవ్వరు ఇళ్లు దాటి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే వచ్చిన జంతువు చిరుత పులి అని పోలీసులు చెబుతుండగా.. అది చిరుతపులి అని కచ్ఛితంగా చెప్పలేమని వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్‌లు చెబుతున్నారు.